Ticker

6/recent/ticker-posts

బాలికల భద్రతపై 2కే రన్ ద్వారా అవగాహన : అధికారులు పాల్గొనడం


ఏలూరు: ఏలూరు ఇండోర్ స్టేడియంలో రామ చంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ వారి ఆధ్వర్యం లో 2 కె రన్ ను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ శ్రీమతి సూర్య చక్రవేణి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, మహిళా ఎస్‌ఐ శ్రీమతి నాగమణి సమక్షంలో సేవ్ గర్ల్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు బాలికల భద్రత, మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళా చట్టాలు, POCSO చట్టం (మైనర్ బాలికలపై లైంగిక దాడుల నివారణ చట్టం), బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు మరియు వాటి అమలుపై వివరించారు.

మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టం పూర్తిగా వారి పక్షాన ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 181 వంటి సహాయ నెంబర్ లు వినియోగించు కోవాలని సూచించారు. మహిళా ఎస్‌ఐ శ్రీమతి నాగమణి POCSO చట్టం కింద నమోదయ్యే నేరాలు, శిక్షలు, ఫిర్యాదు చేసే విధానం, బాధితులకు అందే రక్షణ చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ శ్రీమతి సూర్య చక్రవేణి మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం సమిష్టిగా బాధ్యత వహించాలని అన్నారు. పిల్లల హక్కుల పరి రక్షణకు సంబంధించిన చట్టాలను సక్రమంగా అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

ఈ “సేవ్ గర్ల్” కార్యక్రమం ద్వారా విద్యార్థినులు మరియు యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించి, బాలికలపై అఘాయిత్యాలను నివారించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.