Ticker

6/recent/ticker-posts

కోకో రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ


ఏలూరు జనవరి 8 : కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చర్యలు చేపట్టాలని, కోకో గింజలు కోకో ఉత్పత్తులపై  దిగుమతి సుంకం పెంచి దేశీయంగా రైతులకు ధర పెరిగేలా చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టేలా వారి దిష్టికి కోకో రైతుల సమస్యలు తీసుకువెళ్లాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో  ఏలూరు పార్లమెంట్ సభ్యులు  పుట్టా మహేష్ కుమార్ కు కోకో రైతులు వినతిపత్రం అందజేశారు.


గురువారం ఎంపీ నివాసం వద్ద కోకో రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ప్రతినిధి బృందంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చలు జరిపారు. కోకో రైతుల సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కంపెనీలు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని  చెప్పారు. 

మన దేశ అవసరాలకు కావలసిన కోకో గింజలు 20% మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతున్నదని, 80% కోకో గింజలు,కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నామని వివరించారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు నామమాత్రంగా ఉండడం వలన విదేశీ కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుని దేశీయంగా రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం లేదని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాల పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయిస్తున్న విధంగా కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ధర పాలసీ లేకపోవడంతో కంపెనీల ఇస్టా రాజ్యంగా మారిందని చెప్పారు. కోకో గింజలకు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేసిన ఫలితంగా రూ.500 కోట్లు రైతులు నష్టపోయారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రూ.50 ప్రోత్సాహం అందించి కిలో కోకో గింజలకు రూ.500 ధర కల్పించారని లేకపోతే కోకో రైతులు మరింతగా నష్టపోయేవారని చెప్పారు. 

ఈ సంవత్సరం ఈ నెల నుండి సీజన్ ప్రారంభమైందని ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుండి రూ.400 లకు రైతుల ఆందోళనతో పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కోకో రైతులు పాల్గొన్నారు.