ANDHRPRADESH:ఏపీలో గతేడాది వైసీపీ ప్రభుత్వం కుప్పకూలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తెర వెనుక మాత్రం కూటమి సర్కార్ పై విపక్షాలతో పాటు ఓ ఇద్దరు రిటైర్డ్ అధికారులు, అందులోనూ జగన్ బాధితులు మాత్రం కారాలూ మిరియాలూ నూరుతున్నారు. అయితే బహిరంగంగా మాటల్లో కాకుండా తమ చేతలతో వారు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
జగన్ హయాంలో అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న చాలా మంది అధికారుల్ని టార్గెట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా ఉన్నారు. వీరిద్దరినీ జగన్ తీవ్రంగా టార్గెట్ చేశారు. వీరిద్దరినీ కక్షగట్టి మరీ తమ స్ధానాల నుంచి తప్పించేడమో, లేక సస్పెండ్ చేయడమో చేసారు. దీంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తప్పించి ఆయన స్ధానంలో తమిళనాడుకు చెందిన మాజీ జస్టిస్ కనగరాజ్ ను ఆఘమేఘాల మీద కరోనా సమయంలో లాక్ డౌన్ ను కూడా పట్టించుకోకుండా అంబులెన్స్ లో తీసుకొచ్చి మరీ సీట్లో కూర్చోబెట్టారు. దీంతో ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మళ్లీ పదవిలోకి వచ్చేశారు. అదే సమయంలో నిఘా పరికరాల కొనుగోలు ప్రయత్నాలను కారణంగా చూపుతూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పదవి తెచ్చుకుని చివరి రోజు మాత్రమే డ్యూటీ చేసి రిటైర్ అయ్యారు.
దీంతో ఈ ఇద్దరు అధికారులు జగన్ సర్కార్ టార్గెట్ గా పరోక్షంగా కూటమి పార్టీలకు మద్దతుగా క్షేత్రస్ధాయిలో పనిచేశారు. సభలు,సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో జనానికి వివరించారు. ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో జగన్ హయాంలో జరిగిన నష్టానికి పరిహారంగా వీరికి కీలక పదవులు దక్కుతాయని ఆశించారు. అలాగే జనం కూడా అలాగే అనుకున్నారు. కానీ అంతా తలకిందులైంది. ఏబీవీకి తన స్థాయికి తగని పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఇస్తే తీసుకోకుండా వదిలేశారు. నిమ్మగడ్డకు అదీ దక్కలేదు.
దీంతో వీరిద్దరూ ఇప్పుడు రెండు కీలక విషయాలపై పోరాటాలు మొదలుపెట్టారు. తమను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేస్తూ క్షేత్రస్ధాయిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ముందుగా జగన్ బాధితుల్ని కలిసి వారికి న్యాయం చేయాలంటూ చంద్రబాబు సర్కార్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. ఇది కొనసాగుతుండగానే తెలుగ రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న బనకచర్లకు వెళ్లి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
అటు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అయితే రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటనలు చేస్తూ రెండో విడత భూసేకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అలాగే అక్కడి రైతుల్ని చైతన్యవంతం చేస్తున్నారు. దీంతో వారు గ్రామసభల్లో తొలి విడత భూములిచ్చిన వారికి న్యాయం చేయకుండా రెండో విడత భూసేకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు సర్కార్ ను చికాకు పెడుతున్నారు. దీంతో నిమ్మగడ్డ వ్యవహారం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇలా ఒకప్పటి జగన్ బాధితులైన ఏబీవీ, ఇటు నిమ్మగడ్డ ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
Social Plugin