Ticker

6/recent/ticker-posts

'ఆపరేషన్‌ సిందూర్‌'పై వ్యాఖ్యలు: పాక్‌ నటీనటులపై బ్యాన్‌?- ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ల వ్యాఖ్యలివీ


INDIA NEWS: భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌ , మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది. వారిని తక్షణమే భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని సంఘం పిలుపునిచ్చింది.


బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో AICWA నటీనటుల వ్యాఖ్యలను విమర్శించింది. వారి వ్యాఖ్యలు మన దేశాన్ని అగౌరవపరచడమే కాకుండా ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులను.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయని పేర్కొంది.

భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే పాకిస్థానీ కళాకారులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా బ్యాన్‌ విధించాలని సంఘం డిమాండ్ చేసింది. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దని కోరింది. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌరవపరచడమేనని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని AICWA నొక్కి చెప్పింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం అని ప్రకటన పిలుపునిచ్చింది.

అంతేకాకుండా భారతీయ గాయనీగాయకులు పాక్‌ సింగర్స్‌తో వేదికలను పంచుకోవద్దని సంఘం సూచించింది. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.

కాగా, గత నెల ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం రాత్రి, భారత్ 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం.

- ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ల వ్యాఖ్యలివీ
ఆపరేషన్‌ సిందూర్ పై పాకిస్థానీ చిత్రసీమకు చెందిన కొందరు ప్రముఖులు ప్రతికూలంగా స్పందించారు. వారిలో భారతదేశంలో కూడా సుపరిచితులైన నటీనటులు ఫవాద్‌ ఖాన్‌ , మహిరా ఖాన్‌ ఉన్నారు. మహిరా ఖాన్‌ భారత చర్యను "తీవ్రంగా పిరికిపంద చర్య"గా అభివర్ణించగా, ఫవాద్‌ ఖాన్‌ దీనిని "సిగ్గుమాలిన దాడి"గా పేర్కొంటూ "పాకిస్థాన్ జిందాబాద్" అని పోస్ట్ చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌'పై ఫవాద్‌ ఖాన్‌ మరియు మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచాయి. కళకు దేశాల సరిహద్దులు లేవని కొందరు వాదించినప్పటికీ, దేశభక్తి , జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలపై సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వివాదం భారతీయ సినీ పరిశ్రమలో పాకిస్థానీ కళాకారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.