Ticker

6/recent/ticker-posts

మక్కువ ప్రజాశక్తి జర్నలిస్ట్ పై తెలుగు దేశం నేత దాడికి ఖండన


బాద్యుడిని అరెస్ట్ చెయ్యాలి.. ఎపిడబ్ల్యూ జెఫ్ ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్

ఏలూరు జిల్లా, ఏలూరు ప్రతినిధి: పార్వతీపురం మన్యం, మక్కువ మండల "ప్రజాశక్తి" విలేకరి మల్యాడ రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌ నాయుడు దాడి అన్యాయమని, అప్రజాస్వామికమని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూ జె ఎఫ్) ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

ఈమేరకు కమిటీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ డీ జబీర్, కార్యదర్శి హరీష్, రాష్ట్ర కార్యదర్శి, కె ఎస్ శంకర్రావు, సీనియర్ నాయకులు కె బాలసౌరి, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, నెట్ వర్క్ ఇంచార్జ్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటన విడుదల జేశారు. ఈ దాడిని ప్రతి ఒక్కరు కండించాలని కోరారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ డీ జబీర్, రాష్ట్ర కార్యదర్శి, కె ఎస్ శంకర్రావు లు మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం స్థానిక ఏ- వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్‌ నాయుడిని కలవడానికి ప్రజాశక్తి విలేకరి రామారావు వెళ్లగా ఆయన పై టిడిపి నేత బూతులు తిట్టడమే కాకుండా చేయి చేసుకున్నారని వివరించారు. 


ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ‘ఎన్నికల కోడ్‌ అధికారులకు పట్టదా..?’ అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో ప్రజాశక్తిలో వార్త ప్రచురించారు. దీంతో కక్ష పెట్టుకున్న వేణుగోపాల్‌ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకరి రామారావుపై భౌతిక దాడికి తెగబడ్డాడని తెలిపారు. ఆయనను వేణు గోపాల్ షర్ట్‌ పట్టుకొని తలపై కొట్టాడని. ఇంకా దాడి చేస్తుండగా అక్కడ ఉన్న వ్యక్తులు అడ్డుకున్నారని, దానితో అడగకుండా అంతు చూస్తాను.. నిన్ను ఇక్కడ చంపి పాతి పెడతానంటూ ఆగ్రహంతో విలేకరిపై విరుచుకుపడ్డారని తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం మక్కువ పోలీసు స్టేషన్‌లో వేణుగోపాల్‌ నాయుడుపై విలేకరి రామారావు ఫిర్యాదు చేశారని, వేణుగోపాల్‌ నాయుడు నుండి రక్షణ కల్పించాలని, దాడి చేసిన అతనిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే కేసు నమోదు చేసి వేణు గోపాల్ నాయుడుని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెపడతామని హెచ్చరించారు. 

అధికార పార్టీ నాయకుల తప్పొప్పులను ప్రజలకు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రధాన విధి. ఈ విధిని నిర్వహిస్తున్న విలేకరిపై దాడి చేయడం, ప్రజాస్వామ్యానికి, విరుద్ధమైన చర్య. దీనిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖండిస్తుదన్నారు. తెలుగుదేశం నాయకుడు వేణుగోపాల్ నాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ దాడికి ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాల్సిందిగా ఏలూరు జిల్లా ఫెడరేషన్ కమిటీలనుకోరింది.