Ticker

6/recent/ticker-posts

నూకాలమ్మ దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన చైర్మన్, కమిటీ సభ్యులు..


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: పట్టణంలోని నూకాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న శ్రావణమాస ఉత్సవాల కరపత్రికను శుక్రవారం చైర్మన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతికరమైన మాసం శ్రావణమాసమని చెబుతారన్నారు. మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అర్చించే శ్రావణమాసంలో విశేష పూజా కార్యక్రమాలు అనేకం నూకాలమ్మ ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలతో కూడిన కరపత్రికను భక్తుల సమక్షంలో ఆలయకమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ చతుర్వేదస్వస్తి తదితర విశేషపూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే శ్రావణ మాసం నెలరోజులపాటు మహిళా బృందంతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసామని భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 

శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష పసుపు కొమ్ముల అలంకరణలో, రెండవ శుక్రవారం స్వర్ణవర్ణపూర్ణ కవచా లంకరణలోను, మూడవ శుక్రవారం లక్ష గాజుల అలంకరణలో, నాల్గవ శుక్రవారం వివిధ రకాల పండ్ల అలంకరణలో శ్రావణ అమావాస్య రోజు వివిధ రకాల కాయకూరల అలంకారంలో దర్శన మిస్తారని పేర్కొన్నారు. ఈ అలంకారాల నిమిత్తం భక్తులు ధనరూపంలో గాని, వస్తురూపంలోగాని ఆలయ కార్యాలయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.