ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతిలో జరుగుతున్న కేబినెట్ భేటీకి హాజరయ్యారు. అంతలోనే ఆయన తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారన్న వార్త అందింది. దీంతో వెంటనే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చేసి అర్ధాంతరంగా బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అనంతరం ఆస్పత్రిలో తల్లి అంజనా దేవిని పరామర్శిస్తారు.
ఇవాళ కీలకమైన కేబినెట్ భేటీ ఉండటంతో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే అమరావతి సచివాలయానికి వచ్చారు. కేబినెట్ భేటీ లో కూర్చున్నారు. అనంతరం తల్లి అంజనా దేవి అస్వస్ధతకు గురైనట్లు ఆయనకు ఫోన్ వచ్చిన్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే సీఎంకు సమాచారం ఇచ్చి అత్యవసరంగా కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో అన్నయ్య చిరంజీవి కూడా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ మధ్యలో నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మెగాస్టార్ తల్లి అంజనా దేవి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమె స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, కోలుకుంటున్నట్లు స్వయంగా చిరంజీవి వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపారు. దీంతో అంజనా దేవి ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలన్నీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మరోసారి అంజనా దేవి అసస్వస్ధతకు గురయ్యారన్న వార్తలతో పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఆమె ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Social Plugin