ANDRAPRADESH: మాజీ ఎంపీ మాజీ రాజకీయ నాయకుడు అయిన విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఉన్న సైలెంట్ ని బద్ధలు కొట్టారు. సుదీర్ఘమైన ట్వీట్ తో ఆయన వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు నన్ను అనవసరంగా కెలుకుతున్నారు. జగన్ కోటరీకి ఇది అలవాటు అయింది అని ఫైర్ అయ్యారు నన్ను కెలికి జగన్ కి నష్టం చేయాలని చూస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. తాను పొలిటికల్ గా ఫ్రీ బర్డ్ అని ఆయన చెప్పారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే అని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే తప్పేంటి అన్నట్లుగా మాట్లాడారు. తనకు క్రిష్ణ కుటుంబంతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని ఆయన అన్నారు.
ఆ పరిచయంతోనే తాను అక్కడికి వెళ్ళాను అని ఆ సమయానికి టీడీపీ నేత టీడీ జనార్ధన్ కూడా వచ్చారని అదంతా కాకతాళీయం తప్పించి మరేమీ లేదని ఆయన అన్నారు ఏ రకమైన చర్చలూ అక్కడ జరగనే లేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు. అయినా లిక్కర్ స్కాం లేదని ఒక వైపు జగన్ చెబుతూంటే ఆయన కోటరీ మాత్రం లేని లిక్కర్ స్కాం కోసం నేను టీడీపీ వారితో కూర్చుకుని చర్చలు జరిపాను అని ఆరోపణలు చేయడమే విడ్డూరంగా ఉందని అన్నారు. తాను ఈ జన్మలో టీడీపీలో చేరేది లేదని ఎపుడో చెప్పాను అని కూడా ఆయన అన్నారు.
అయినా తాను టీడీపీలో చేరాలీ అనుకుంటే చంద్రబాబునో లోకేష్ నో కలుస్తాను కానీ వేరే వ్యక్తులతో ఎందుకు భేటీ అవుతాను అని ఆయన ప్రశ్నించారు. తాను రాజకీయాలను వదిలేసిన వ్యక్తిని అని తాను ఎవరితో భేటీ అయితే ఎందుకు నొప్పి అని జగన్ కోటరీని ప్రశ్నించారు. అనవసరంగా తనను కెలికి జగన్ కి నష్టం తేవాలనే కోటరీ అనుకుంటోందని ఆయన అన్నారు. తాను చేయని తప్పులను నెత్తిన వేసుకుని 21 కేసులకు 2011లో జైలుకు వెళ్ళాను అని ఆయన చెప్పారు. ఇపుడు కూడా జగన్ మీరు లిక్కర్ కేసులు నెత్తిన వేసుకోవాలని చెబితే తాను ఒప్పుకునేవాడినేమో అన్నారు. కానీ జగన్ కోటరీ కోసం కేసులను తాను ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు. గత నాలుగేళ్ళుగా తనను వైసీపీలో అవమానించిన కోటరీ ఇంకా తనను వేధిస్తోంది అని అన్నారు.
కోటరీ మాటలనే జగన్ నమ్ముతున్నారని ఆయన విమర్శించారు. కోటరీ చెప్పినది విని జగన్ తనను పక్కన పెట్టారని కూడా ఆయన అన్నారు. జగన్ కోటరీకి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదని వారి అనాలోచిత చర్యల వల్లనే జగన్ కి నష్టం చేకూర్చాలని భావిస్తున్నారు అని ఆయన విమర్శించారు. తనను ఇరిటేట్ చేసి కెలికితే జగన్ కే నష్టం అని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినా కోటరీ కెలుకుతోంది అంటే ఎలా అని ఆయన అన్నారు. తాను సైలెంట్ గా ఉండడం నచ్చడం లేదు వారికి అని ఆయన మండిపడ్డారు.
మొత్తం మీద చూస్తే తనను కెలకవద్దు అని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్లుగానే ఉంది. తనను కెలకడం వల్ల కోటరీకి పోయేది ఏదీ లేదని జగన్ కే నష్టం అన్నారు. ఇక తాను మూడు తరాలుగా వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడనని చెప్పుకున్నారు. ఆయన తాజాగా చేసిన సుదీర్ఘమైన ట్వీట్ లో సైతం జగన్ కి నష్టం కలిగించాలని చూస్తున్నారు అనే అంటున్నారు. జగన్ మీదనే ఆయన ఒకింత సాఫ్ట్ కార్నర్ ని చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి కోటరీ వర్సెస్ విజయసాయిరెడ్డి గా మారి ఆయన పార్టీ నుంచి దూరంగా ఉన్న ఈ వ్యవహారంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని కోటరీని కంట్రోల్ లో పెట్టి సాయిరెడ్డి గురించి ఏమీ అనకుండా చూస్తుందా లేక కెలికి తనకే నష్టం తెచ్చుకుంటుందా అన్నది చూడాలని అంటున్నారు.