ఎరువుల సరఫరాలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లు గుర్తిస్తే ఏ ఒక్కరినీ వదిలేదు లేదు..
ANDRAPRADESH, ఏలూరు: ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు వెంటనే యుద్ధప్రాతిపదికన ఎరువులు సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై వ్యవసాయాధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎరువుల పంపిణీలో వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న పెదపాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు, కలిదిండి, ముదినేపల్లి, బుట్టగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు తాడేపల్లిగూడెం నుండి వస్తున్న 500 టన్నుల యూరియాని ఆయా మండలాలలోని సొసైటీలకు, డీలర్లకు అత్యవసరంగా శుక్రవారం సాయంత్రానికే పంపించాలని, మిగిలిన సోసియేటీలు, డీలర్లకు ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మండల పరిధిలో ప్రస్తుత ఎరువుల నిల్వలు, రానున్న వారానికి అవసరమైన ఎరువుల వివరాలను మండల వ్యవసాయాధికారి వారీగా కలెక్టర్ ఆరా తీశారు.
జిల్లాలో ఎరువులు పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా సరఫరా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాలో జిల్లాలో ఎక్కడైనా అధిక మోతాదులో పంపిణీ చేసిన సంఘటనలను గుర్తిస్తే వెంటనే వాటిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద పెద్దమొత్తంలో యూరియా నిల్వలు లేకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
ఎరువుల సరఫరాలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లు గుర్తిస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. డీలర్ల వద్ద ఎరువుల రైతులందరికీ వారికి అవసరమైన ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని, మోతాదుకు మించిన ఎరువులు రైతులు వినియోగించకుండా, ఎరువుల అధిక వినియోగం వలన కలిగే అనర్దాలను రైతులకు తెలియజేయాలన్నారు.
జిల్లాలో అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఎరువులు పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా మార్క్ ఫెడ్ శాఖతో సమన్వయం చేసుకుని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణ చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. కల్తీ ఎరువుల బారిన రైతులు పడకుండా గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేసి బిల్లులను తప్పనిసరిగా అడిగి తీసుకొవాలని రైతులకు తెలియజేయాలన్నారు.
వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా,డి సి వో శ్రీనివాస్,మండల వ్యవసాయాధికారులు,మార్క్డ్ అధికారులు టెలీకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు.