Ticker

6/recent/ticker-posts

AP Rains: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక- వచ్చే 24 గంటల్లో ఈ జిల్లాలకు అలర్ట్..!


ANDHRAPRADESH:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా.. విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

రానున్న 24 గంటల్లో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో మరింత బలపడే పరిస్ధితి ఉందన్నారు. దీంతో ఏపీకి భారీ వర్షాలు తప్పవన్నారు. వచ్చే 48 గంటల్లో
ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయన్నారు.

అల్పపీడనం ప్రభావంతో రేపు (శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 58మిమీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 49.7మిమీ, అల్లూరి జిల్లా ముంచింగిపుట్టులో 44.5మిమీ, చింతపల్లిలో 41.5మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.