Ticker

6/recent/ticker-posts

స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుండాలా ? ఏపీ సర్కార్ క్లారిటీ..!


ఏపీలో త్వరలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిబంధన పెట్టబోతోందన్నది ఈ ప్రచారం సారాంశం. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ రాష్ట్రంలో ప్రజల్ని పదే పదే కోరుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీనిపై స్పష్టత ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి "ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నవాళ్లే అర్హులు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ చంద్రబాబు చెబుతున్నట్లు వచ్చిన వార్తల క్లిప్ ను పెట్టి ఫేక్ అని స్పష్టం చేసింది.

1994లో ఆనాటి పరిస్థితుల దృష్ట్యా "ఇద్దరు పిల్లల కన్నా మించి సంతానం ఉంటే వారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు" అని నాటి ప్రభుత్వాలు నిబంధన పెట్టాయని, కానీ ఆ నిబంధనను పంచాయతీ రాజ్ చట్టం నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చిందని గుర్తుచేసింది. ఫిబ్రవరి 11, 2025 నుంచి అమలులోకి వచ్చిన ఈ సవరణ పై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా అప్పుడే జారీ చేసిందని తెలిపింది.