Ticker

6/recent/ticker-posts

పూట గడవని స్థితిలో పాకీజా... బాబు, పవన్ సాయం కోసం ఏపీకి


వాసుగి అలియాస్ పాకీజా. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

వాసుగి అలియాస్ పాకీజా. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అలా వెండితెరపై గతంలో ఎందరినో నవ్వించిన ఆమె.. ప్రస్తుతం పూట గడవడం కోసం భిక్షాటన చేసే దుస్థితిలో ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఎవరూ ఆదుకోకపోవడంతో.. సాయం కోసం ఏపీకి వచ్చారు.

అవును... తమిళనాట సహాయం దొరకకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ లోనైనా ఆదరణ దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారట వాసుగి! ఇందులో భాగంగా... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో... బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం చెన్నై నుంచి గుంటూరు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాసుగి... తమిళ సినిమాల్లో తనను చూసిన మోహన్‌ బాబు మొట్టమొదటిసారి తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. 'అసెంబ్లీ రౌడీ' సినిమాలో పాకీజా పేరుతో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చిందని.. దీంతో... తర్వాత వరుసగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించానని తెలిపారు.

ఆ క్రమంలో రాజకీయాల్లోకి వెళ్లి, అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న తాను అక్కడ ఉన్న రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. తమ పెళ్లి ఇష్టం లేని అత్తమామలు వేధించేవారని.. మరోవైపు తన భర్త తాగుడుకు బానిసై ఉన్న బంగారం, డబ్బు అంతా పాడు చేశాడని.. కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు.

దీంతో... అత్తామామలు తనను ఇంటి నుంచి తరిమేశారని.. అప్పటికే నాన్న చనిపోవటంతో అమ్మ దగ్గరికి చేరానని.. ఈ క్రమంలో దగ్గర ఉన్న కొద్ది సొమ్మును అమ్మ క్యాన్సర్‌ వైద్యం కోసం ఖర్చు చేశానని చెప్పిన వాసుగి... జయలలిత ఉన్నంత కాలం తనకు తింటానికి, ఉంటానికి లోటు లేదని.. ఆమె మరణించిన తర్వాత పరిస్థితి పూర్తిగా దిగజారిందని అన్నారు.

ఈ పరిస్థితుల్లో తన పరిస్థితి గురించి వీడియోలు తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరికీ పంపినా ఎవరూ స్పందించలేదని చెప్పిన వాసుగి... తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చిరంజీవి, నాగబాబు, మోహన్‌ బాబు కుటుంబం స్పందించి చనిపోయే స్థితిలో ఉన్న తనను బతికించారని తెలిపారు.

ఈ సందర్భంగా... నాడు తనను సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టింది తెలుగు వారే అని చెప్పిన వాసుగి.. ఇప్పుడు అదే తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు స్పందించి తనను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ని కలిసి తన గోడు వినిపించుకుందామని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ప్రభుత్వం పెన్షన్‌ సౌకర్యం కలిపిస్తే ఉన్నంత కాలం వారి పేరు చెప్పుకొని బతుకుతానని.. అవసరం అయితే గొంతులో ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం ఊరు ఊరు తిరిగి ప్రచారం చెయ్యమన్నా చేస్తానని.. ఇదే విషయాన్ని చంద్రబాబును కలిసి చెప్పాలన్నది తన కోరిక అని పాకీజా వెల్లడించారు.