Ticker

6/recent/ticker-posts

ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా సబ్బుల పెట్టెలు ఎత్తుకెళ్లిన జనం..


మంచిర్యాల జిల్లా ఇటిక్యాలలో అమానవీయ ఘటన

సబ్బుల లోడ్ తో వెళుతున్న లారీని ఢీకొట్టిన ట్యాంకర్

డ్రైవర్ దుర్మరణం, క్లీనర్ కు తీవ్ర గాయాలు

బాధితులను పట్టించుకోకుండా సబ్బుల కోసం ఎగబడ్డ జనం

పోలీసులు వచ్చేలోపే సగం లోడు ఖాళీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

కళ్ల ముందే ఘోర ప్రమాదం.. లారీ, ట్యాంకర్ ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలతో క్లీనర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. వెంటనే స్పందించి సాయం అందించాల్సిన స్థానికులు మాత్రం మానవత్వం మరిచి లారీలోని సబ్బులను ఎత్తుకెళ్లడంలో మునిగిపోయారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునేలోగా లారీలోని సగం లోడును ఖాళీ చేసేశారు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. 

లక్సెట్టిపేట నుంచి రాయచూర్‌కు సబ్బుల లోడుతో వెళ్తున్న లారీని ఇటిక్యాల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు గాయపడిన వారిని పట్టించుకోకుండా లారీలోని సబ్బులను దోచుకోవడానికి పోటీపడ్డారు. బాధితుల ఆర్తనాదాలు వారిని కదిలించలేకపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆలోపే లారీలోని సగానికి పైగా సబ్బుల లోడును జనం ఎత్తుకెళ్లారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళ్లెదుటే ఒక ప్రాణం పోయినా, మరికొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా, ఏమాత్రం కనికరం లేకుండా సొంత లాభం కోసం సబ్బులను దోచుకెళ్లిన తీరు పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.