Ticker

6/recent/ticker-posts

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భళా!


TELANGANA: హైదరాబాద్‌ ఇళ్ల మార్కెట్‌ 2025లో మెరిసింది. అమ్మకాలు 6 శాతం పెరిగి 54,271 యూనిట్లుగా ఉన్నాయి. 2024లో విక్రయాలు 51,337 యూనిట్లుగా ఉన్నాయి. దక్షిణాదిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో అమ్మకాలు గతేడాది 15 శాతం పెరిగి 1.33 లక్షల యూనిట్లకు చేరినట్టు ప్రాప్‌టైగర్‌ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2025లో 3,86,365 యూనిట్లుగా ఉన్నట్టు, 2024లో విక్రయాలు 4,36,992 యూనిట్లతో పోల్చితే 12 శాతం తగ్గినట్టు పేర్కొంది.  


బెంగళూరులో 54,414 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు 2025లో నమోదయ్యాయి. 2024లో విక్రయాలు 48,272 యూనిట్ల కంటే 13 శాతం పెరిగాయి.

    చెన్నైలోనూ గతేడాది ఇళ్ల విక్రయాలు 55 శాతం దూసుకెళ్లి 24,892 యూనిట్లకు చేరాయి.

    కోల్‌కతాలో విక్రయాలు 15,172 యూనిట్లుగా ఉన్నాయి. 2024తో పోల్చితే 12 శాతం పెరిగాయి.

    ముంబై రీజియన్‌లో విక్రయాలు 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పరిమితమయ్యాయి.

    ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 13 శాతం తగ్గాయి. 35,711 యూనిట్లు అమ్ముడయ్యాయి.

    పుణెలో అమ్మకాలు 12 శాతం తగ్గి 29,223 యూనిట్లకు పరిమితమయ్యాయి.

    అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 37,087 యూనిట్లుగా ఉన్నాయి.

    టాప్‌–8 నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 6 శాతం తగ్గి 2025లో 3,61,096 యూనిట్లుగా ఉంది. 2021 తర్వాత ఇదే కనిష్ట సరఫరా అని ప్రాప్‌ టైగర్‌ నివేదిక తెలిపింది.  

డిమాండ్‌ దెబ్బతినలేదు.. 
‘‘2025 సంవత్సరంలో డిమాండ్‌కు విఘాతం కలగలేదు. సర్దుబాటు జరిగిందంతే. కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. డెవలపర్లు మాత్రం సరఫరా పరంగా సమయోచితంగా వ్యవహరించారు. ఈ ధోరణి నిల్వపరమైన ఒత్తిళ్లు తగ్గి, ధరలు స్థిరంగా ఉండేలా సాయపడింది’’అని ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ ఈడీ ఓంకార్‌ షెట్యే తెలిపారు.