డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: పచ్చని కోనసీమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ అవసరాలు, అవినీతి కారణంగా సర్వనాశనం చేస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేజీ బేసిన్ త్రవ్వకాల వల్ల కోనసీమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పాశర్లపూడి, ఇరుసుమండ ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయని తెలిపారు. గాలి, నీరు కాలుష్యంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
12వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేజీ బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం వాటా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. కోనసీమ నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడకపోవడం దురదృష్టకరమన్నారు.
కేజీ బేసిన్లో అక్రమ త్రవ్వకాల వెనుక అధికారులు, ప్రైవేట్ మాఫియా ప్రమేయం ఉందని ఆరోపించారు. వేల కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా, కోనసీమ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరడం లేదన్నారు.
కేజీ బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం వాటా తక్షణమే అమలు చేయాలని, ఓఎన్జీసీ కేంద్ర కార్యాలయాన్ని చెన్నై నుంచి రాజమండ్రికి తరలించాలని, ఓఎన్జీసీ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.200కే సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఈ సమావేశానికి అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


.jpeg)
