Ticker

6/recent/ticker-posts

మోదీ బ్రాండ్ కే ఓటు.. ఇండియా టుడే-సీఓట‌ర్ స‌ర్వేలో వెల్ల‌డి


INDIA NEWS: గ‌తంలో ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే స‌ర్వేలు, వాటి ఫలితాలు క‌నిపించేవి. వినిపించేవి. కానీ ఇప్పుడు ఆర్నెళ్లకు, ఏడాదికోసారి సర్వేలు నిర్వహిస్తున్నారు. త‌ద్వారా రాజ‌కీయ పార్టీలు ప్ర‌జాభిప్రాయాన్ని అంచ‌నా వేస్తున్నాయి. స‌ర్వేలు అధికార పార్టీకి లోపాలను స‌రిదిద్దుకునే అవ‌కాశం ఇస్తే.. ప్ర‌తిప‌క్షానికి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ నిర్దేశించుకోవ‌డానికి ప‌నికొస్తున్నాయి. అయితే.. ఆ ఫ‌లితాల‌ను ఎవ‌రు ఏ విధంగా ఉప‌యోగించున్నారు అన్న‌ది ముఖ్యం. దీని ఆధారంగానే త‌ర్వాతి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటున్నాయి. 


ఇటీవ‌ల ఇండియా టుడే-సీవోట‌ర్ మూడ్ ఆఫ్ ది నేష‌న్ తెలుసుకోవ‌డానికి స‌ర్వే నిర్వ‌హించింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఎవ‌రు గెలుస్తారు అన్న‌ది తేల్చ‌డం స‌ర్వే ల‌క్ష్యం. ఈ స‌ర్వే ప్ర‌కారం ఇప్ప‌టికిప్పుడు దేశంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఎన్డీఏ కూట‌మికి 352 సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలింది. ఇండియా కూట‌మికి 182 సీట్లు వ‌స్తాయని వెల్ల‌డైంది. ఓట్ల శాతం లెక్క‌లు తీసుకుంటే బీజేపీకి 41 శాతం, కాంగ్రెస్ కు 20 శాతం, ఇత‌ర పార్టీల‌కు 39 శాతం ఓట్లు వ‌స్తాయని ఇండియా టుడే- సీవోట‌ర్ స‌ర్వేలో తేలింది. ఇక్క‌డ బీజేపీకి ఒంటరిగా 41 శాతం ఓట్లు వ‌స్తే.. సీట్లు మాత్రం 287 వ‌స్తాయ‌న్న‌ది స‌ర్వే సారంశం. ప్ర‌స్తుతం ఎన్డీఏలో ఉన్న పార్టీల‌న్నింటికి క‌లిపి 352 సీట్లు వ‌స్తాయి. 

మోదీకే జ‌నం ఓటు.. ప్ర‌ధానిగా మోదీకే జ‌నం ఓటు వేశారు. 55 శాతం మంది మోదీ బెస్ట్ ప్ర‌ధాని అంటూ చెప్పిన‌ట్టు స‌ర్వేలో తేలింది. మోదీ ప‌నితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్య‌క్తం చేశారు. గ‌తంలో చేసిన స‌ర్వేతో పోల్చితే మోదీ ప‌నితీరు ప‌ట్ల మూడు శాతం ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెరిగింది. అదే విధంగా రాహుల్ గాంధీ వైపు 27 శాతం మంది ప్ర‌జ‌లు మొగ్గుచూపిన‌ట్టు స‌ర్వేలో తేలింది. దీని ద్వారా ఓట‌ర్ల విశ్వాసం ఎన్డీఏపై త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2024లో 234 సీట్లు సాధించిన ఇండియా కూట‌మి.. 182 సీట్ల‌కు ప‌డిపోతుంద‌ని స‌ర్వేలో పేర్కొన‌డం ఆస‌క్తిక‌ర అంశం. 2025 ఆగ‌స్టులో మెట్ఎన్ స‌ర్వేలో 208 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. ఆ స‌ర్వేలో వ‌చ్చిన సంఖ్య కంటే ఇది త‌క్కువ‌. 

2024 ఫ‌లితాల కంటే మెరుగ్గా.. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాట‌లేక‌పోయింది. 240 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. 272 మ్యాజిక్ ఫిగ‌ర్ ముందు నిలిచిపోయింది. బీహార్ లోని నితీశ్ కుమార్, ఏపీలోని చంద్ర‌బాబు స‌హ‌కారంతో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్ ఓడిపోయిన‌ప్ప‌టికీ.. గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించింది. కానీ హ‌ర్యాన‌, ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, బీహార్ ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయింది. జ‌మ్మూక‌శ్మీర్, జార్ఖండ్ లో ఇండియా కూట‌మికి ఊర‌ట ల‌భించింది. 

మోదీ బ్రాండ్.. ప‌హ‌ల్గామ్ దాడి త‌ర్వాత పాకిస్థాన్ కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌, ట్రంప్ టారిఫ్ వార్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలో .. అమెరికా ఒత్తిడికి త‌లొగ్గ‌కుండా మోదీ వ్య‌వ‌హ‌రించిన తీరు.. మోదీకి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ తెచ్చిపెట్టిన‌ట్టు స‌ర్వేలో వెల్ల‌డైంది. మోదీపై ఉన్న న‌మ్మ‌క‌మే ఎన్డీఏ వైపు ప్ర‌జ‌లు మొగ్గుచూప‌డానికి కార‌ణ‌మైందని తేలింది. మ‌రోవైపు బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఓట్ చోర్ ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది.