ఏలూరు, మార్చి, 10: జిల్లాలోని ఇంజనీరింగ్ తదితర శాఖల ద్వారా వసూలు కావలసిన జీఎస్టీ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇంజనీరింగ్ తదితర శాఖల ద్వారా చెల్లించిన బిల్లులకు సంబంధించి వసూలు కావలసిన జీఎస్టీ వివరాలపై మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించిన బిల్లులు, కాంట్రాక్టు ఏజెన్సీల వివరాలు, జీఎస్టీ బకాయిల వివరాలను వెంటనే వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమర్పించాలని సూచించారు.
అలాగే జిల్లాలోని వివిధ ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల నుండి వసూలు చేసిన వృత్తి పన్నుల వివరాలను కూడా వెంటనే సమర్పించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ అమలులోకి రాకముందు జిల్లాలో వివిధ సంస్థల నుంచి వసూలు చేయవలసిన రూ.70.31 లక్షల బకాయిలను కూడా త్వరితగతిన వసూలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, రహదారులు–భవనాలు, గృహ నిర్మాణ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.



.jpeg)