ANDRAPRADESH: జిల్లాల పునర్విభజన అంశంపై లేదా జిల్లాలకు పేరు మార్పు సరిహద్దులు మార్పు వంటి అంశంపై నియమించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటివరకు పని ప్రారంభించలేదు. మరి దీనికి కారణాలు ఏంటి.. అనేది పక్కన పెడితే, మరోవైపు సమయం చేరువవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి జిల్లాల సరిహద్దులు అదేవిధంగా మండలాల సరిహద్దులు పోలీస్ స్టేషన్ల సరిహద్దులు నిర్ణయించి ఇవ్వాలని కేంద్ర గణాంక శాఖ అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.
లేకపోతే డిసెంబర్ 31 నాటికి ఉన్నటువంటి సరిహద్దులను మాత్రమే తమ పరిగణలోకి తీసుకుంటామని ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు సంవత్సరాల వరకు సరిహద్దులు మార్చడానికి కానీ, జిల్లాల పేర్లు మార్చటానికి కానీ మండలాల పేర్లు మార్చడానికి వీలులేదని స్పష్టం చేసి దాదాపు రెండు నెలలు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రుల కమిటీ దీనిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని గత క్యాబినెట్ సమావేశంలో చెప్పారు.
కానీ, తాజా క్యాబినెట్ సమావేశానికి వచ్చే సరికి అసలు దీని గురించి చర్చ లేకుండా పోయింది. ప్రస్తుతం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసలు జిల్లాల విభజన గాని జిల్లాల గురించిన సమస్యలు గానీ జిల్లాలపై ఎట్లా ముందుకు వెళుతున్నారనే విషయాన్ని గాని సీఎం గాని డిప్యూటీ సీఎం కానీ ఎవరూ స్పందించలేదు. అంటే దీనిని బట్టి అసలు అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల విషయంపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.
మరోవైపు ఎక్కడికక్కడ అనేక సమస్యలు ప్రభుత్వానికి వస్తున్నాయి. కొందరు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతుంటే మరికొందరు జిల్లాల పేర్లను మార్చాలని కోరుతున్నారు. అయితే వీటికి వ్యతిరేకంగా అదే జిల్లాల నుంచి మరికొందరు వాదన వినిపిస్తున్నారు. వీరంతా కలిసి ఒకే పార్టీకి చెందిన వారై ఉండడం వీరందరూ స్థానికంగా బలమైన నాయకులై ఉండడం బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉండటంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఏం చేయాలి అన్నది ప్రశ్నగా మారింది.
దీంతో అసలు జిల్లాల పునర్ విభజన, లేకపోతే మండలాల విభజన అనే ప్రక్రియను దాదాపు పక్కన పెట్టేశారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు గనక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వానికి అవకాశం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కుల గణన జరుగుతుం ది. 2027లో జనాభా గణన ప్రారంభమవుతుంది. ఈ రెండు అయ్యే సరికి 2028 దాకా సమయం పడుతుంది. అంటే దాదాపు 2029 నాటికి సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి కచ్చితంగా జిల్లాల విభజన అంశం మళ్లీ మరుగున పడిపోతుంది.
దీనిని బట్టి మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది.. మంత్రివర్గ ఉప సంఘం ఏ విధంగా స్పందించాలి అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే దీనిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదన్నది వాస్తవం. మంత్రులుగాని మంత్రివర్గ ఉపసంఘం కానీ దీనిపై మౌనంగా ఉన్నారు. మరోవైపు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించలేక అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం చేస్తారనేది చూడాలి.