Ticker

6/recent/ticker-posts

రుషికొండ `ప్యాలెస్‌`పై ఇంకా డైల‌మానే.. !


ANDRAPRADESH, VISAKHAPATNAM: విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఋషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భారీ కట్టడం పరిస్థితి ఏంటి? ఇంకా దానిని ఏం చేయాలి అనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతూనే ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిని తాజాగా మానసిక చికిత్సలయానికి కేటాయించాలంటూ గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా యాదృచ్ఛికంగా అన్నారా అనేది పక్కన పెడితే నిజంగా అదే పని గనుక జరిగితే కచ్చితంగా అది ప్రభుత్వ తప్పిదమే అవుతుంది. 


ఆయన ఒక లీక్‌ ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతోంది. ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచన చేస్తోందని, మానసిక చికిత్సలయానికి ఆ ప్యాలస్‌ను ఇచ్చేయాలన్నది కొందరి ఆలోచనగా ఉందని టిడిపి వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇదే గనక జరిగితే అది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి భారీ కట్టడమే అయినప్పటికీ అది ప్రజాధనంతో నిర్మించిన భవనం. కాబ‌ట్టి.. ప్రభుత్వం ఏ రకంగా వినియోగించుకున్నా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా దీనిపై తాత్సారం చేయడం ఏంటన్నది ప్రశ్న. 

500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో 16 నెలలు గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కించటం.. ఇంకా మాకు ఆలోచన రావడంలేదని కొత్తగా ఆలోచనలు ఉంటే పంచుకోవాలని చెప్పి మంత్రుల కమిటీని నియమించడం వంటివి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక మంత్రుల కమిటీకి సమయం నిర్దేశించకపోవడంతో అసలు మంత్రుల కమిటీ ఎప్పుడు పనిచేస్తుంది ఎలా ముందుకు వస్తుందనేది కూడా ప్రశ్నగా మారింది. ఈ పరిణామాల క్రమంలోనే తాజాగా గోవా గ‌వ‌ర్న‌ర్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. 

వాస్తవానికి దీనిని రాష్ట్రపతి భవనగా వినియోగించుకోవచ్చు. పర్యాటక ప్రాంతంగా వినియోగించుకుంటే ఆదాయం కూడా ప్రభుత్వానికి చేకూరుతుంది. లేదా తూర్పు నావికాదళం అధికారులు కోరుతున్నట్టుగా దీనిని వారికి ఇచ్చినా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. లేదా విక్రయించే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కాకపోతే తాజ్ వంటి భారీ స్థాయి హోటళ్లు కూడా దీనిని ఇవ్వమని ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు కొన్నాళ్ల‌ కిందట వార్తలు వచ్చాయి. అలాగే చేసినా ప్రభుత్వానికి కనీసం 1500 కోట్ల రూపాయలు అంటే దాదాపు రెండింతలు సొమ్ము చేకూరుతుంది. 

అని ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుని దీనిని రాజకీయ దృష్టితోనే చూస్తే దీనిపై ఆశించిన ఫలితం కన్నా వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఏది ఏమైనా ఈ ప్యాలస్ విషయంలో ఇంకా డైల‌మా అయితే.. కొనసాగుతూ ఉండడం ఇంకా ఏం చేయాలన్న దగ్గరే ప్రభుత్వం ఆగిపోవడం వంటివి సరికాదన్నది సొంత పార్టీలోనూ నాయకులు చెబుతున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుని, దీన్ని సద్వినియోగం చేయడం ద్వారా ప్రజల సొమ్మును కాపాడుకున్నట్టు అవుతుందని అంటున్నారు. 

కావాలంటే రాజకీయాలు విడిగా చేసుకోవచ్చు అన్నది సీనియర్ నేతలు ఇటీవల చంద్రబాబు దగ్గర కూడా సూచించారు. దీనికి ఆయన మళ్లీ ఎదురు ప్రశ్నిస్తూ..``అయితే మీరే చెప్పండి. దీన్ని ఏం చేద్దాం`` అని అడగడం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో వారందరూ మౌనం పాటించారు. ఎలా చూసుకున్నా విశాఖలో నిర్మించిన ప్యాలెస్ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది ప్రచారం అయితే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. ఒకవేళ నిజంగా ఎన్నికల సమయానికి కూడా దీన్ని అలాగే ఉంచి రాజకీయం చేయాలి అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పు లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.