Ticker

6/recent/ticker-posts

జనసేనలో చేరుతున్నారనే వార్తలపై వైసీపీ నేత జక్కంపూడి క్లారిటీ


జనసేనలో చేరుతున్నామనే వార్తల్లో నిజంలేదన్న జక్కంపూడి

తాము జగన్ వెంటనే ఉంటామని స్పష్టీకరణ

చిరంజీవిపై తమ కుటుంబానికి ఎనలేని అభిమానం ఉందని వెల్లడి

ANDHRAPRADESH:తమ కుటుంబం జనసేన పార్టీలో చేరుతోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. తాము జగన్ వెంటే నడుస్తామని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పదవిలో ఉండి కూడా బాధ్యతలు నిర్వర్తించకుండా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పదవిలో లేకపోయినా తాము నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నామని అన్నారు. "ఎన్నికల ముందు ఒక మహిళకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ఆయన నిలదీశారు.

కొందరు జనసేన సైకో ఫ్యాన్స్ తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయంగా గుర్తింపు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని, తమ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవిపై ఎనలేని అభిమానం ఉందని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. తమ తమ్ముడి వివాహానికి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు, జక్కంపూడి కుటుంబం రాజకీయాల్లో ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇదే సమావేశంలో, ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. జులై 14వ తేదీలోగా కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే, తాను గానీ, తన తల్లి గానీ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి, ఇతర ఎమ్మెల్యేలు ఇప్పుడు ముఖం చాటేశారని ఆయన ఆరోపించారు.