ANDHRAPRADESH:ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. అనంతరం పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రధాన అజెండా పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేబినెట్లో మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాల్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తెచ్చారు. ఓ మహిళా ఎమ్మెల్యేను (వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి)ని వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే మంత్రులు ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిత్యం ప్రతీ మంత్రీ అప్రమత్తంగా ఉండాలని బాబు కోరారు.
మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించామని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లభ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందని కితాబిచ్చారు. అయితే చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారని తెలిపారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్‍లో సీఎం మంత్రులకు స్వయంగా చదివి వినిపించారు.
అటు ఇండోసోల్ సంస్థకు భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే జగన్ అని, అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ తన మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Social Plugin