వైసీపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది. పార్టీ వీడిన సాయిరెడ్డి గురించి పార్టీ ముఖ్య నేతల మధ్య ఆసక్తి కర చర్చ సాగుతోంది. జగన్ లండన్ పర్యటన లో ఉన్న సమయంలో వైసీపీకి.. రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. జగన్ వద్ద ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నానని సాయిరెడ్డి వెల్లడించారు. ఆ తరువాత లిక్కర్ స్కాం.. కాకినాడ పోర్టు విచారణ వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను జగన్ కు నష్టం చేసే విధంగా వ్యవహరించనని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు సాయిరెడ్డి విషయంలో జగన్ పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి తో జగన్ తరపు సందేశం చేరిందని.. సాయిరెడ్డి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
కీలక బాధ్యతలు
వైసీపీలోకి సాయిరెడ్డి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సాయిరెడ్డి వైసీపీ వీడారు. వైఎస్ హయాంలోనే సాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. టీటీడీ బోర్డు మెంబర్ గా.. ఓబీసీ డైరెక్టర్ గా వ్యవహరించారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ కు మద్దతుగా నిలిచారు. జగన్ తో పాటుగా జైలుకు వెళ్లారు. వైసీపీ లో క్రియా శీలకంగా వ్యవహరించారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి. ఢిల్లీలో పెద్దల తో సత్సంబంధాలు కొనసాగించారు. వైసీపీ - ఢిల్లీ మధ్య సంధాన కర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో విజయం తరువాత కేంద్రం - ఏపీ మధ్య కీలకంగా పని చేసారు.
రాజకీయాలకు దూరం
అయితే, 2024 ఎన్నికల ఫలితాల తరువాత సీన్ మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయం లో చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన సాయిరెడ్డి ఓడిపోయారు. ఆ తరువాత పార్టీలో తీసుకుంటున్న నిర్ణ యాలు సాయిరెడ్డికి నచ్చలేదు. ఇక, జగన్ లండన్ లో ఉన్న సమయంలో పార్టీ - రాజకీయాలు వీడుతున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు. జగన్ కోటరీ కారణంగానే అంటూ విమర్శలు చేసారు. ఆ తరువాత సాయిరెడ్డి కూటమిలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. బీజేపీ చేరే ప్రయత్నం చేసార నే వార్తలు వచ్చాయి. ఇక.. మద్యం స్కాం.. కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు హాజరైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీలోకి రీ ఎంట్రీ..!?
ఇక.. సాయిరెడ్డి పార్టీ వీడటం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే.. సాయిరెడ్డి వైసీపీ కోసం ఎంతో చేసారని.. ఆయన సేవలు పార్టీకి అవసరమనే చర్చ జరిగింది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాయిరెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే బాగుంటుందనే ప్రతిపాదన జగన్ వద్ద ముఖ్య నేత ప్రస్తావన చేసినట్లు సమాచారం. సాయిరెడ్డి పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, ఆయన సాయిరెడ్డితో చర్చించారని.. జగన్ పైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని సాయిరెడ్డి చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ సాగుతోంది. దీంతో.. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి రావటానికి రంగం సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, అసలు సాయిరెడ్డి నిర్ణయం ఏంటి.. తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారుతోంది.
Social Plugin