Ticker

6/recent/ticker-posts

జగన్ తో వల్లభనేని వంశీ భేటీ-భార్యతో కలిసి థ్యాంక్స్..!


ANDHRAPRADESH:ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న ఐదు నెలల తర్వాత విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతూ తాజాగా వీటి నుంచి తాత్కాలిక ఊరట పొందిన వంశీ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. భార్య పంకజ శ్రీతో కలిసి వంశీ .. ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా జైలు జీవితం, తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు.

గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ.. వైఎస్ జగన్ పై నమ్మకంతో వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించారు. దీంతో గత ఎన్నికల్లో ఆయన్ను గన్నవరం నుంచి వైసీపీ టికెట్ లభించింది. అయితే కూటమి గాలిలో వంశీ ఓడిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం అండతో గతంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో మొదలుపెట్టి, తాజాగా అక్రమ ఇళ్లపట్టాల పంపిణీ, భూముల కబ్జా వంటి పలు కేసులు పెట్టారు. దీంతో గత ఐదు నెలలుగా వంశీ విజయవాడ జిల్లా జైలులోనే మగ్గుతున్నారు. ఈ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేసి రిమాండ్ కొనసాగించారు. ఈ క్రమంలో వంశీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో మధ్యలో కోర్టు ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కూడా చేయించారు. చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో వంశీ నిన్న విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.

వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. 140 రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది. ఈ నిర్బంధం నుంచి నిన్న విముక్తి లభించడంతో వంశీ ఇవాళ తన భార్య పంకజశ్రీతో కలిసి జగన్ ను కలిశారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్‌.జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. తిరిగి పార్టీ తరఫున యాక్టివ్ కావాలని వంశీకి జగన్ ఈ సందర్భంగా సూచించారు.