Ticker

6/recent/ticker-posts

తెలంగాణలోని విద్యార్థులకు భారీ శుభవార్త.. ఉచితంగా 20 వేల సైకిళ్ల పంపిణీ.. ఆ రోజు నుంచే..


HYDERABAD:తెలంగాణ విద్యార్థులకు భారీ శుభవార్త. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. రూ. 4 వేల విలువైన సైకిల్ విద్యార్థులకు ఉచితంగా అందనుంది. మరి ఏ జిల్లాల వారికి ఈ సైకిళ్లు అందుతాయి. ఎవరెవరికి ఈ సైకిళ్లు అందుతాయో ఇక్కడ తెలుసుకోండి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా 20 వేల సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 11న బండి సంజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో టెన్త్ చదివే పిల్లలు 3,096 మంది ఉన్నారు.

కరీంనగర్ తోపాటు రాజన్న సిరిసిల్లలో 3,841, జగిత్యాల జిల్లాలో 1,137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది.. మొత్తం కలిపి 9,348 మంది బాలబాలికలు పదో తరగతి చదువుతున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేయనున్నారు.

అలాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50 మంది విద్యార్థులకు చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఇక ఒక్కో గ్రామ పంచాయతీలో 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే తొలి దశలో 5 వేల సైకిళ్లను ఈనెల 8 వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ టీమ్ సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో అధికంగా పేద, మధ్యతరగతి వర్గానికి చెందినవారే ఉంటారు. ఇంటి నుండి స్కూల్ కు వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఆటోలు, బస్సుల్లో వెళ్లే స్తోమత ఉండదు. ఇక టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్కూల్ అయిపోయాక స్పెషల్ క్లాసులు అని ఉంటాయి. దీంతో ఎక్కువ సమయం స్కూల్ లోనే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు సైకిళ్లను అందించాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.