Ticker

6/recent/ticker-posts

అంత అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యం కావడం లేదా?

ANDHRAPRADESH:రుషికొండపై మొత్తం పది ఎకరాలను నాలుగు భవనాల కోసం వినియోగించగా, అందులో 4.5 ఎకరాలలో లక్షా 48 వేల 413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉన్నాయి.

రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నంత అనుభవం రెండు రాష్ట్రాల్లో ఎవరికీ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజకీయంగా, పరిపాలన పరంగా చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో నెంబర్ 1. దాదాపు 16 ఏళ్లు సీఎంగా.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పాలనా అనుభవం గడించారు చంద్రబాబు. ఇక రాజకీయాల్లో సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. ఆయన సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవంలో ఇంతటి సంక్లిష్ట సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. అయితే అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా, చంద్రబాబు ఇలా నాన్చడం సరికాదంటూ ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెబుతున్నారు పరిశీలకులు.

రాష్ట్రంలో కీలకమైన, ఆర్థిక రాజధానిగా ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నంలో రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏం చేయాలో చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రుషికొండపై హరిత రిసార్ట్స్ ను కూలగొట్టి గత ప్రభుత్వం అత్యంత రహస్యంగా నాలుగు ఖరీదైన రాజ భవనాలను నిర్మించింది. ఇందుకోసం దాదపు 452 కోట్లు ఖర్చు చేసింది. సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నాలుగు భవన సముదాయాలను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. అప్పట్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని భావించిన వైసీపీ.. ఈ భవనాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని చూసిందని చెబుతారు. అయితే న్యాయ వివాదాల వల్ల ముందుగా ఆ భవనాలను క్యాంపు కార్యాలయంగా ప్రకటించలేదు. కానీ, అత్యంత రహస్యంగా నిర్మించడంతో అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది.

వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే రుషికొండ కేంద్రంగానే పాలన సాగించాలని భావించడంతో ఎన్నికల నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేసింది. అయితే ప్రజా తీర్పుతో వైసీపీ గద్దె దిగిపోవడంతో రుషికొండ భవనాలను ఎంత విలాసవంతంగా నిర్మించారో చూడాలని ప్రభుత్వం వీడియోలు బయటపెట్టింది. దాదాపు 452 కోట్ల రూపాయలతో నాలుగు భవనాలను నిర్మించడం, అవి పర్యాటకుల కోసం వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఆ భవనాలను ఏం చేయాలనేది టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రుషికొండ భవనాలను వినియోగంలోకి తెస్తారని అంతా భావించారు.

రుషికొండపై మొత్తం పది ఎకరాలను నాలుగు భవనాల కోసం వినియోగించగా, అందులో 4.5 ఎకరాలలో లక్షా 48 వేల 413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో 2.3 ఎకారాల్లో ఓ పెద్ద భవనం, మరో రెండు భవనాలు నిర్మించారు. వీటిలో భారీ సమావేశ మందిరంతోపాటు పరిమిత సంఖ్యలోనే పడక గదులు ఉన్నాయి. గత ప్రభుత్వం చెప్పినట్లు పర్యాటక భవనాలు అయితే పర్యాటకులు విశ్రాంతి కోసం ఎక్కువ సంఖ్యలో పడకగదులు ఉండాలి. కానీ, రుషికొండ భవనాలు కేవలం రాజప్రసాదాలుగా నిర్మించడంతో పర్యాటక అవసరాలకు ఉపయోగ పడని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ భవనాలను ఎలా వినియోగించాలనే అంశమై కూటమి ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జనకు గురవుతోంది. ప్రజాభిప్రాయం తీసుకుని, తగిన నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినా రుషికొండ భవనాలపై నిర్ణయం తీసుకోలేకపోయారు. విదేశీ రాయబార కార్యాలయాలుగా చేయాలని కొందరు, కన్వెన్షన్ సెంటర్లుగా వినియోగించాలని మరికొందరు, ఐటీ కంపెనీలకు కేటాయించాలని మరికొందరు సూచనలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన ఏ సూచనను అమలు చేయాలన్నా అదనంగా మరో రూ.50 నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేయాల్సిన ఉంటుందనే కారణంగానే తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు రుషికొండ భవనాలను పరిశీలించి ఎలా వినియోగిస్తే బాగుంటుందో సూచించాలని సీఎంవోలో ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఆయన కూడా ఇప్పటివరకు రుషికొండకు రాలేదని చెబుతున్నారు.

మరోవైపు రుషికొండ భవనాలను ప్రజా సందర్శనార్థం వినియోగించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో మంచితోపాటు చెడు ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో రుషికొండపై తీవ్ర తర్జనభర్జన జరుగుతోందని చెబుతున్నారు. అంత అనుభవశాలి అయిన చంద్రబాబు కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోవడం ఏంటంటూ చర్చ జరుగుతోంది.