Hyderabad:తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించిన తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తాజాగా మరొక సంచలన నిర్ణయంతో తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్త స్టాంపు విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త
ఈ కొత్త సవరణ బిల్లును రాబోయే శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్త సవరణ బిల్లులో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు లాభం చేకూర్చేలాగా మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు.
స్టాంప్ డ్యూటీపై కీలక నిర్ణయం
పాత, కొత్త అపార్ట్మెంట్ల లోని ఫ్లాట్ లకు స్టాంప్ డ్యూటీ ప్రస్తుతం ఒకే విధంగా ఉందని, పాత అపార్ట్మెంట్ల ఫ్లాట్ లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ ని తగ్గించే ఆలోచనలో ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
పాతబిల్లు స్థానంలో కొత్త బిల్లు
భారతీయ స్టాంపు చట్టం 1899ప్రకారం తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లు , 26 ఆర్టికల్స్ ను సవరించడానికి 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. ఈ బిల్లుపైన కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చినప్పటికీ 2023జనవరిలో సవరణ బిల్లును వెనక్కు పంపిందని, దీంతో ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాతబిల్లు స్థానంలో కొత్త బిల్లు తెస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా భూముల ధరల సవరింపు
ఇదే సమయంలో సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు ఉండాలని, కొత్త ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా బిల్లును రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువకు తగ్గట్టుగా భూముల ధరలను సవరించాలని ఆయన సూచించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi
Social Plugin