Ticker

6/recent/ticker-posts

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జూన్ 17: ఈ నెల 28వ తేదీ ఆదివారం జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో టాస్క్ ఫోర్స్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఆమె అధ్యక్షతన నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఎక్కడా ఒక్క పిల్లవాడు కూడా మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,00,073 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా, 1,094 పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో గ్రామీణ, గిరిజన, పట్టణ, ట్రాన్సిట్, మొబైల్ టీమ్స్ ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు.

పల్స్ పోలియో కార్యక్రమం కోసం 4,814 మంది సిబ్బందిని నియమించామని, అవసరమైన వ్యాక్సిన్ డోసులు, వైల్స్ సిద్ధంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. మొదటి రోజు టీకా అందుకోలేని చిన్నారులకు 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మూడు రోజులపాటు 100 శాతం లక్ష్య సాధన కోసం పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.

వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల పిల్లలు, గుడారాల్లో నివసించే కుటుంబాల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో బూత్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం రోజుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

పల్స్ పోలియోపై గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.