ఏలూరు, జూన్ 17: యోగ ఒక ఉత్తమ జీవనశైలి అని, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో బుధవారం విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగా సాధనలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, యోగా అనేది శతాబ్దాలుగా భారతీయుల జీవన విధానంలో భాగమైందని పేర్కొన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించిన అనేక విదేశీ దేశాలు కూడా దీనిని తమ జీవనశైలిలో భాగంగా చేసుకున్నాయని తెలిపారు.
యోగాను ఒకరోజు చేసి మానేయకుండా ప్రతిరోజూ కనీసం అరగంట నుంచి గంట సమయం కేటాయించి అభ్యాసం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, జీవితంలో మరింత సంతృప్తి సాధించవచ్చని వివరించారు.
భారతీయ సంస్కృతిలో అమూల్యమైన సంపదగా ఉన్న యోగాను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే యోగాపై అవగాహన పెంపొందించి సాధన చేయిస్తే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
ఈ నెల 19న పట్టిసీమలో భారీ స్థాయిలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌వో ఎల్. దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, డీపీవో జి. మల్లికార్జునరావు, జిల్లా ఆయుష్ అధికారి బి. భాస్కర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ. భానుప్రతాప్, డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ గాయత్రీదేవి, మెప్మా పీడీ రాజబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

