ఏలూరు, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఏలూరులోని వట్లూరు టిటిడిసి కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక అంతర్భాగంగా మారాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, యువత యోగాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మేధస్సు వికసించి, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా ఆసనాలు ఆచరించడమే కాకుండా కనీసం మరో ముగ్గురిని యోగా వైపు ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం శుభపరిణామమని ఎస్పీ కొనియాడారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)లతో కలిసి ఎస్పీ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


