Ticker

6/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ ఆలయంలో డాక్టర్ రాజాన సత్యనారాయణకు ఘన సత్కారం


శుక్రవారం వారపు పూజలు వైభవంగా నిర్వహణ

జంగారెడ్డిగూడెం, జూన్ 12: స్థానిక శ్రీ నూకాలమ్మ ఆలయ ఆవరణలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు)కు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారపు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ నూకాలమ్మ దేవస్థానం అధ్యక్షుడు రొంగల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆలయ కమిటీ గౌరవ సలహాదారు కనుపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ సభా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ అనేక సంవత్సరాలుగా శ్రీ గంగానమ్మ, గోకుల పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప స్వామి దేవాలయాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. 2018లో శ్రీ నూకాలమ్మ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, నిరంతరం అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్‌గా డాక్టర్ రాజాన నియామకం భక్తులందరికీ ఆనందదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మద్ది క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేయగల సమర్థ నాయకత్వం ఆయన సొంతమని కొనియాడారు. మద్ది క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు ఆంజనేయ స్వామి ప్రసాదించాలని ఆకాంక్షించారు.

గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ రాజానకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణబాబు తన పాటల ద్వారా రాజాన సేవలను కొనియాడారు. నూకాలమ్మ దేవస్థానం ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం, అభివృద్ధిలో రాజాన చేసిన సేవలను గుర్తుచేసి ప్రశంసించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణ కూడా రాజాన సత్యనారాయణను ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, నిత్య పూజా కైంకర్యాలు, సాయంసంధ్య హారతి కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనాలతో రాజాన సత్యనారాయణను ఆశీర్వదించారు. శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు దుశ్శాలువలు, పూలదండలు, పుష్పగుచ్ఛాలతో ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రీ నూకాలమ్మ తల్లి ఆశీస్సులతోనే తాను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రతి హిందూ కుటుంబం వారానికి కనీసం రెండు రోజులైనా దేవాలయాలకు వచ్చి దైవచింతనలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో సేవ చేస్తున్నానన్నారు. తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, రొంగల పుల్లయ్య, చిట్లూరి సర్వేశ్వరరావు, గాలి నూకరాజు, చింతకాయల అచ్చిరాజు, తిరుపతి రమేష్, నాళం రాజు, పంచాడ రామకృష్ణ, రొంగల సత్యనారాయణ, చిట్లూరి వెంకటేశ్వరరావు, తల్లాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు.