Ticker

6/recent/ticker-posts

అసత్య ప్రచారాలను తిప్పికొట్టిన ‘వాయిస్ ఆఫ్ డీఎస్సీ’ సదస్సు


విజయవాడ, జూన్ 21: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులతో "వాయిస్ ఆఫ్ డీఎస్సీ" పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి (డీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ ఉపాధ్యాయులకు మద్దతు ప్రకటించారు.


ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో నిర్వహించిన డీఎస్సీలలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నిర్వహించబడినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ పూర్తి చేసి వేలాది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.

టీచర్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మెగా డీఎస్సీ నిర్వహించకపోవడం వల్ల నిరుద్యోగులు నష్టపోయారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల భవిష్యత్తును దెబ్బతీసేలా జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుందని పేర్కొన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వాహకుడు దండమూడి చౌదరి (డీసీ) మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులు అధిగమించి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు భావితరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలుగు యువత ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, తెలుగు యువత నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.