ఏలూరు, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న **“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం”** జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు విజయగాథలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సంబంధిత శాఖలు సిద్ధం చేసి అందజేయాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులకు ముందస్తుగా ఆహ్వాన పత్రికలు అందించాలని ఆదేశించారు.
ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సుమారు 10 వేల మంది రైతులు, లబ్ధిదారులు, మహిళలు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్, అల్పాహారం, భోజన వసతులు, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల తరఫున ఏడు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, తల్లికి వందనం, స్త్రీశక్తి పథకం, అన్న క్యాంటీన్లు, పీ-4 బంగారు కుటుంబాలు, అన్నదాత సుఖీభవ, సూర్యఘర్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కార్యక్రమంలో వివరించాలని కలెక్టర్ తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల అనుభవాలను ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీకి బదులుగా 17వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్నతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

