Ticker

6/recent/ticker-posts

అవయవదానంపై పెరిగిన స్పందన.. ఆరో స్థానంలో ఏపీ: మంత్రి సత్యకుమార్


అమరావతి: అవయవదానంలో రాష్ట్రానికి ఆరో స్థానం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అవయవదానాల్లో ఏపీ ఆరో స్థానంలో నిలిచిందన్నారు. ఈరోజు(మంగళవారం) జీవన్‌దాన్ కార్యకలాపాలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు నెలల్లో రాష్ట్రంలో 64 మందికి కొత్త జీవితం లభించిందని అన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అవయవదానంపై స్పందన గణనీయంగా పెరిగిందన్నారు. యువత, మధ్య వయస్సు వారిలో అవయవదానం పట్ల అవగాహన పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు.


అవయవాల కోసం వేచి ఉన్న 5000 మందిలో 50 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. గత ఏడాది 301 అవయవమార్పుడులు జరిగాయన్నారు. 93 మంది బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవాలు సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్యను మరింత పెరగాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.