Ticker

6/recent/ticker-posts

తాడిపత్రి వదిలివెళ్లిపో.. కేతిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు


ANDRAPRADESH: సుప్రీంకోర్టు తీర్పుతో భారీ భద్రత మధ్య శనివారం తాడిపత్రి వచ్చిన పెద్దారెడ్డికి 24 గంటలు గడవక ముందే పట్టణం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులిచ్చారు.  వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాకిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో భారీ భద్రత మధ్య శనివారం తాడిపత్రి వచ్చిన పెద్దారెడ్డికి 24 గంటలు గడవక ముందే పట్టణం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన తర్వాత మళ్లీ తాడిపత్రి రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత 16 నెలలుగా తాడిపత్రిలో తన ఇంటికి దూరంగా ఉన్న పెద్దారెడ్డి న్యాయ పోరాటం ద్వారా శనివారమే వచ్చారు. ఆయన కోసం సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  


జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో భారీగా పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రిలో అడుగుపెట్టి తన పంతం నెగ్గించుకున్న పెద్దారెడ్డిని 24 గంటలు గడవక ముందే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే రాజకీయంగా తన పంతం నెగ్గినందున పెద్దారెడ్డి పోలీసుల నోటీసులను సీరియసుగా తీసుకోలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధులకు పోలీసులు వెళుతున్నందున మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసులకు సహకరించాలని నిర్ణయించారని అంటున్నారు. ఎస్పీ నుంచి మెయిల్ రాగానే తన స్వగ్రామం తిమ్మంపల్లి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

తాజా అప్డేట్ తో తాడిపత్రి రాజకీయం మళ్లీ చర్చకు దారితీసింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, ఎక్కడా లేనట్లు తాడిపత్రిలో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య ఉప్పు-నిప్పులా పరిస్థితి తయారైంది. గత ఎన్నికలకు ముందు పట్టణంలో తీవ్ర అలజడి చెలరేగగా, పోలీసులు ఉభయ పార్టీలకు చెందిన నేతలను పట్టణ బహిష్కరణ విధించారు. ఇక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నాన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హవా పెరిగిపోయిందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయనని ఆయన పలుమార్లు బహిరంగంగా హెచ్చరించారు. 

ఈ పరిస్థితుల్లో కేతిరెడ్డి దాదాపు 16 నెలలుగా తాడిపత్రి రాలేకపోయారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్లేందుకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశాలు పొందారు. సుప్రీం తీర్పుతో శనివారం తాడిపత్రిలో అడుగుపెట్టారు పెద్దారెడ్డి. అయితే ఆ సమయంలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. దాదాపు 600 మంది పోలీసులు మోహరించి, పెద్దారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. చివరికి అనుకున్నట్లు తన పంతం నెగ్గించుకున్న పెద్దారెడ్డి అనూహ్యంగా 24 గంటలు గడవకముందే తాడిపత్రిని వీడాల్సిరావడం గమనార్హం. 

అయితే, పెద్దారెడ్డి పంతం నెగ్గించుకున్నా, ఆయన తాడిపత్రిలో ఉండకుండా వెళ్లిపోయేలా అధికార పార్టీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పారని అంటున్నారు. సుప్రీం ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పెద్దారెడ్డిని అడ్డుకునే విషయంలో వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి 24 గంటలు తిరగకముందే పెద్దారెడ్డిని తిమ్మంపల్లి వెళ్లిపోయేలా చేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాకుగా చూపారని అంటున్నారు. 

ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రిలో అడుగు పెట్టడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 11 నుంచి జేసీ బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తానని పెద్దారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే 10వ తేదీ వరకు ఆయన పట్టణంలోనే ఉండే పరిస్థితి లేనందున 11 నుంచి ఆ కార్యక్రమం ఉంటుందా? ఉండదా? అనేది కూడా సస్పెన్స్ గా మారింది.