ANDRAPRADESH: పవన్ యాక్టర్ కం పొలిటీషియన్. ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. పొలిటికల్ తెర మీద పవర్ ఫుల్ స్టార్. ఇక ఆయన పదేళ్ళ రాజకీయం తరువాత ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలక శాఖలనే ఆయన చూస్తున్నారు. అయితే ఆయన హీరోగా సినిమాల్లో కనిపించి అలరిస్తారా అన్న చర్చ అయితే ఉంది. పవన్ తాను గతంలో కమిట్ అయిన సినిమాలకు ఈ మధ్యనే పూర్తి చేశారు. కొత్తగా సినిమాలకు ఓకే చెబుతారా లేదా అన్న సందేహాలు ఒక వైపు ఉండగానే ఆయన వీర మల్లు విషయంలో అధికార దుర్వినియోగం చేశారు అన్న దాని మీద ఒక మాజీ ఐఏఎస్ అధికారి కోర్టుకు వెళ్ళారు. దాంతో కోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ ఎన్టీఆర్ వ్యవహారం :
రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఆయన సినిమాలు చేయకూడదని ఎక్కడా లేదని కోర్టు పేర్కొంది. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కోర్టు తీర్పుని ఉటంకించింది. అప్పట్లో అన్న గారు ఏకంగా సీఎం గా ఉండగానే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ చేశారు. ఆయన విశ్వామిత్రుడు గెటప్ లోనే అనేక కీలక ఫైళ్ళ మీద సంతకాలు చేసిన ఫోటోలు ఆనాటి పత్రికలలో ప్రముఖంగా ప్రచారం అయినవి ఉన్నాయి. అంతే కాదు షూటింగ్ స్పాట్ వద్దనే కొందరు ఉన్నతాధికారులు కూడా ఉండి ఆయనతో సమాలోచనలు జరిపిన సందర్భాల మీద అప్పట్లో చర్చ సాగింది.
ఆయనతో పోలిస్తే పవన్ కూడా :
సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి ఉమ్మడి 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా సినిమా షూటింగులు చేశారు. ఆయనతో పోలిస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అంటే ఒక మంత్రిగానే అన్న మాట. మొత్తం ప్రభుత్వం భారం అయితే ఆయన మీద లేదు దాంతో ఆయన ఒక కంట తన శాఖ పనులు చక్కబెడుతూ మరో వైపు ఖాళీ సమయంలో ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చు అన్న మాట. దానికి న్యాయపరమైన పేచీపూచీలు లేవని కూడా తేలిపోయిన విషయంగా ఉంది. ఆయన ఇష్టం, ఓపిక తీరిక ఇక్కడ ఆలోచించాలి కానీ వేరే విధమైన అడ్డంకులు అయితే లేవనే అంటున్నారు.
పార్టీ కోసమే అంటున్నారు :
పవన్ విషయానికి వస్తే ఆయన చాలా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. తన పార్టీ నడపడానికి సినిమాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతోనే పార్టీని ముందుకు తీసుకుని వెళ్తాను అని. అది అనివార్యం అని. అయితే ఇక్కడ పవన్ సినిమాలు చేయడం వల్ల బహుళ లాభాలు ఉన్నాయి. ఆయన క్రేజ్ అలాగే ఉంటుంది. దాంతో ఆయన పార్టీకి కూడా అది శ్రీరామ రక్షగా ఉంటుంది అదే సమయంలో పార్టీకి కూడా ఒడిదుడుకులు లేకుండా సాగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే అటు మీటింగులు ఇటు షూటింగుల మధ్య బాలెన్స్ చేసుకోవడమే పవన్ చేయాల్సిన విషయం అని అంటున్నారు.
ఫోకస్ ఉంటుందా :
ఇక్కడ మరో చిక్కు విషయం కూడా ఉంది అని అంటున్నారు. సినిమాలు రాజకీయం రెండూ ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న రంగాలే. అందువల్ల పార్టీ కోసం సినిమాలు ఎంచుకోవచ్చు. కానీ అదే సమయంలో పార్టీకి పూర్తి సమయం కేటాయించి ఫోకస్ సీరియస్ గా పెట్టకపోతే ఎలా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అదే సమయంలో సినిమాల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ విజయాలు కూడా కష్టం అవుతాయి.
ఒక విధంగా చెప్పాలీ అంటే రెండు పడవలలో కాలు అన్నట్లుగా ఉంటుంది. అయితే పవన్ వ్యూహం ప్రకారం చూస్తే 2027 దాకా అంటే మరో రెండేళ్ళ పాటు సినిమాలు వేసి చివరి రెండేళ్ళూ ఎన్నికల కోసం రాజకీయాల కోసం కేటాయిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా కళాకారులు అంత సులువుగా తమ వృత్తిని వదులుకోలేరు, ప్రజలు కూడా వారిని అలాగే ఎక్కువగా చూస్తూంటారు.