ANDRAPRADESH:సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వారు ఎప్పుడు సాహసంతో కూడిన జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. జీవనాధారం కోసం సముద్రం పైన ఆధారపడి జీవించే మత్స్యకారులు నిరంతరం ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సముద్రంలోకి వెళ్లిన తర్వాత వచ్చే అలలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కోసారి ఊహించని తుఫానులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రాణాలను పణంగా పెట్టి చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు
సముద్రంలో చేపల వేట ఒక్కొక్కసారి వారికి ఊహించని పరిణామాలకు కూడా కారణమవుతుంది. ఒక్కొక్కసారి మత్స్యకారులు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. తాజాగా అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక కు చెందిన చోడపల్లి ఎర్రయ్య, ఆయన తమ్ముడు కొర్లయ్య, వాసుపల్లి ఎల్లాజీ, కనగాల అప్పల రాజులు నిన్న తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.
మత్స్యకారుడిని నీళ్ళలోకి లాక్కెళ్ళిన చేప
తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా వాళ్ళ గేలానికి సుమారు 100 కిలోల బరువు ఉండే కొమ్ముకోనాం చేప చిక్కింది. యర్రయ్య దానిని బోట్ లోకి లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో చేప యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్ళింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఎర్రయ్య భారీ చేపను దక్కించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి గల్లంతయ్యాడు.
సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు
ఎర్రయ్య ఎలాగోలా మళ్ళీ బోట్ లోకి వస్తాడని చూసిన వారు ఎంతకీ ఎర్రయ్య రాకపోయేసరికి ఆందోళన చెందారు. కళ్ళ ముందే ఎర్రయ్య గల్లంతు కావడంతో అతని సోదరుడు కన్నీరు మున్నీరవుతూ గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు సముద్రంలో అతని కోసం ఎంతగా గాలించినప్పటికీ యర్రయ్య జాడ దొరకలేదు. ప్రస్తుతం ఇంకా 26 సంవత్సరాల యువకుడు ఎర్రయ్య కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
దీంతో పూడిమడక గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకు కోసం తల్లి కోదండమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేపలు పట్టుకుని జీవనోపాధి సాగించే మత్స్యకారుల జీవితాలు సముద్రంలో ఇటువంటి ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే నాధుడు లేడని మత్స్యకార కుటుంబాలు లబోదిబోమంటున్నారు.
Social Plugin