Ticker

6/recent/ticker-posts

మహిళలపై మాట జారిన నేతపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం


అసభ్యకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత పొన్ముడిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

సరైన చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని తీవ్ర హెచ్చరిక

రాజకీయ నేతలు రాజుల్లా మాట్లాడుతున్నారని కోర్టు వ్యాఖ్యలు

NATIONAL:మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న డీఎంకే నేత, మాజీ మంత్రి కె.పొన్ముడిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమిళనాడు పోలీసులు సరిగ్గా స్పందించకపోతే, కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హెచ్చరించింది.

రాజకీయ నాయకుల మాటతీరుపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని అడ్డుపెట్టుకుని రాజకీయ నేతలు అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారు. చేతికి మైక్ దొరకగానే తామే రాజులన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ దేశం కేవలం రాజకీయ నాయకులది మాత్రమే కాదు. తాము కూడా అందరిలాగే మనుషుల మధ్యే బతుకుతున్నామన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలను మేం చూస్తూ ఊరుకోలేం" అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

గతంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడుతూ, ఓ సెక్స్ వర్కర్, కస్టమర్ మధ్య సంభాషణను ఉదహరిస్తూ అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దుమారం రేగింది.

ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని డీఎంకే ఎంపీ కనిమొళి, గాయని చిన్మయి, నటి ఖుష్బూ సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. వివాదం ముదరడంతో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.