ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన
రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ కోటా వర్తింపు
అన్ని కేటగిరీలు, స్థాయిల్లోని పోస్టులకు ఇది వర్తిస్తుందని వెల్లడి
మహిళా సాధికారతే లక్ష్యమన్న నితీశ్ సర్కార్
NATIONAL:రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటన చేశారు. మహిళా సాధికారత దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగని ఆయన పేర్కొన్నారు.
ఈ కొత్త విధానం ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో, అన్ని కేటగిరీలు, స్థాయిల్లోని పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది. అయితే, ఈ రిజర్వేషన్ బీహార్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులైన మహిళలకు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సీఎం నితీశ్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ప్రభుత్వ పాలన, పరిపాలనలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవల్లోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీశ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Social Plugin