మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రాధాన్యమిచ్చిన వలంటీర్ల వ్యవస్థే తమ కొంప ముంచిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ANDHRAPRADESH:మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రాధాన్యమిచ్చిన వలంటీర్ల వ్యవస్థే తమ కొంప ముంచిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలు మూల స్తంభాలు, కానీ వైసీపీ మాత్రం వలంటీర్లను నమ్మకుని నిండా మునిగిపోయిందని వాపోతున్నారు. ఏడాదిగా పార్టీలో చాలా మంది నేతలు వలంటీర్ల వ్యవస్థపై నిరసన స్వరాలు వినిపిస్తుండగా, కొందరు అధినేతకు కూడా ఇదే విషయాన్ని తెలియజేసినట్లు చెబుతున్నారు. నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా వలంటీర్ల వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.
నరసారావుపేట వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన గోపిరెడ్డి వలంటీర్లను నమ్ముకుని గత ఐదేళ్లు పూర్తిగా నష్టపోయామంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలు మూల స్తంభాలు కానీ, వాలంటీర్లు కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రజలు-పాలకుల మధ్య కార్యకర్తలను ఉంచాలి. ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్మోహనరెడ్డని మొదటిసారి కలిసినప్పుడు చెప్పాను అంటూ గోపిరెడ్డి గుర్తు చేసుకున్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వలంటీర్ల ద్వారా అందించారు. అదే కార్యకర్తల ద్వారా ఆ లబ్ధిని అందిస్తే ఇలా జరిగేది కాదన్నారు. వలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ పూర్తిగా ఛిన్నాభిన్నం అయిందన్న ఆయన ఇంటికి వచ్చి వాలంటీర్లు పథకాలు ఇస్తే మన పార్టీ నాయకులను మరచిపోయారన్నారు. ఇప్పుడు కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారు. వలంటీర్ల మీద కాదన్నారు. కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు.
Social Plugin