Ticker

6/recent/ticker-posts

జనసేన, పవన్, చిరంజీవిపై జక్కంపూడి రాజా కీలక వ్యాఖ్యలు!

అవును... జక్కింపూడి ఫ్యామిలీ జనసేనలో చేరుతుందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

ANDHRAPRADESH:గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా గోదావరి జిల్లా రాజకీయాల్లో జక్కంపూడి ఫ్యామిలీ జనసేనలోకి వెళ్లిపోనుందనే ప్రచారం బలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఆ ప్రచారాన్ని ఖండిస్తూ పవన్ పై రోజురోజుకీ విమర్శల డోసు పెంచుతూ.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు జక్కంపూడి రాజా.

అవును... జక్కింపూడి ఫ్యామిలీ జనసేనలో చేరుతుందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఈ సందర్భంగా పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులతో జరిపిన సమీక్ష సమావేశంలో పవన్ పై చేసిన విమర్శలను మించి అన్నట్లుగా స్పందించారు.

తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన రాజా.. జక్కంపూడి కుటుంబానికి జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం లేదని అన్నారు. తమ కుటుంబం వైసీపీలోనూ.. వైఎస్‌ జగన్ తోనూ ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల తాను జనసేన పార్టీలో చేరడానికి వారి ఆఫీసు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని కొంతమంది చేస్తున్న ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టి పారేశారు.

కొంతమంది సైకో ఫ్యాన్స్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మతిభ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజకీయంగా ఎదగడానికి పవన్ దృష్టిలో పడటం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు! ఇదే సమయంలో పవన్ పైనా విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... అధికారంలో ఉన్నా అసెంబ్లీకి, కేబినెట్ మీటింగ్స్ కి హాజరు కాకుండా సినిమాలు చేసుకుంటున్నారని పవన్‌ పై విరుచుకుపడ్డారు.

అయితే తాము మాత్రం పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని అన్నారు. అదేవిధంగా.. ఎన్నికల ముందు సోనాలి ప్రీతికి ఏదో అయిపోయిందని గుండెలు బాదుకున్నవారికి.. ఇప్పుడు రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్న ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. 

ఇక... సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పిన రాజా... చిరంజీవి అంటే తమ కుటుంబానికి అభిమానమని స్పష్టం చేశారు. తమ తమ్ముడు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి చిరంజీవి వద్దకు వెళ్తే.. జక్కంపూడి కుటుంబం గురించి గొప్పగా చెప్పారని.. జక్కంపూడి కుటుంబం రాజకీయాల్లో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుందని చిరంజీవి అన్నారని తెలిపారు.

కాగా... ఇటీవల కాకినాడ జిల్లాలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జక్కంపూడి రాజా.. పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గాజువాక, భీమవరం ప్రజలు రైట్, లెఫ్ట్ లెగ్ లతో తంతే పిఠాపురం వచ్చి పడ్డారని.. ఆయన ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారని అన్నారు. 

అయితే... ఏడాది గడిచినా కూడా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ విధంగా మైకు ముందుకొచ్చినప్పుడల్లా పవన్ పై విరుచుకుపడుతున్నారు రాజా!