ANDHRAPRADESH:ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం లెనిన్ సెంటర్ లోని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవ్ ఆసక్తికరమైన డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన చేసిన ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సివుందని అంటున్నారు.
పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం లెనిన్ సెంటర్ కు వెళ్లిన మాధవ్.. విజయవాడ లెనిన్ సెంటర్ పేరును మార్చాలని కోరారు. మన దేశానికి ఎటువంటి సంబంధం లేని లెనిన్ పేరు ప్రముఖ కూడలికి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మాధవ్ చేసిన డిమాండ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయవాడలోని ప్రముఖ కూడళ్లలో లెనిన్ సెంటర్ ఒకటి. 1980ల్లో ఈ సెంటరులో లెనిన్ విగ్రహం పెట్టినప్పటి నుంచి ఆ పేరుతోనే పిలుస్తారు. పుస్తక ప్రియులకు, విద్యార్థులు, కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సెంటర్ అతి ముఖ్యమైనది.
విజయవాడ కార్పొరేషన్ లో కమ్యూనిస్టులు పాలించిన రోజుల్లో లెనిన్ విగ్రహం ఏర్పాటు చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఎంతో ప్రాచుర్యం పొందిన లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన లేదు. రష్యన్ విప్లవకారుడు, కమ్యూనిస్టు రచయితగా లెనిన్ ప్రాముఖ్యత గడించారు. మన దేశంతో ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ, లెనిన్ స్ఫూర్తిని గుర్తించడానికి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 45 ఏళ్లుగా ఈ విగ్రహం నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎత్తైన వేదికపై నిలబడి ఉన్న ఈ విగ్రహాన్ని స్వచ్ఛమైన నల్ల పాలరాయితో చెక్కారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన, కార్మిక దినోత్సవాన్ని భారీగా నిర్వహిస్తారు. ఇక ఇంతటి గుర్తింపు ఉన్న కూడలిని విశ్వనాథ సత్యనారాయణ పేరుగా మార్చాలని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం, ప్రజల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందనేది చూడాల్సివుంది.
Social Plugin