రేపు సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
అడివివరం, గోపాలపట్నం మధ్య వాహనాలకు ప్రవేశం బంద్
భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటు
నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం, మళ్లింపు
ప్రయాణికులు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
ANDHRAPRADESH:సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. ఈ ఆంక్షలు నేటి నుంచి రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. భక్తులు, నగరవాసులు ఈ మార్పులను గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
గిరి ప్రదక్షిణకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పలు కీలక మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించినట్టు తెలిపారు. ఈ ఉదయం 6 గంటల నుంచే అడివివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అడివివరం వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను అడివివరం కూడలి వద్ద పార్క్ చేసి, కాలినడకన స్వామివారి తొలి పావంచాకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా, వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చేవారు సింహపురం కాలనీ వద్ద కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపాల్సి ఉంటుంది.
ఇక సత్తరువు జంక్షన్ నుంచి అడివివరం వైపునకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని, అక్కడి నుంచి హనుమంతువాక వైపు వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు. అలాగే గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి పాత గోశాల కూడలి వైపు కూడా వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు.
భారీ వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. పెందుర్తి, ఎన్‌ఏడీ కూడళ్ల నుంచి గోపాలపట్నం వైపు భారీ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. అనకాపల్లి నుంచి విశాఖ నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలను లంకెలపాలెం కూడలి వద్ద సబ్బవరం వైపు మళ్లిస్తున్నట్లు వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
Social Plugin