ముంబైలో కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఓవరాక్షన్
తన చర్యను సమర్థించుకున్న ఎమ్మెల్యే.. ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన వీడియో
NATIONAL:ముంబైలోని ఎమ్మెల్యే క్యాంటీన్‌లో పాడైపోయిన పప్పు వడ్డించారంటూ ఓ శాసనసభ్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాంటీన్ నిర్వాహకుడిపై బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంజయ్ గైక్వాడ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్చ్‌గేట్‌లోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాను ఆర్డర్ చేసిన థాలీలో పప్పు వాసన వస్తోందని గుర్తించిన ఎమ్మెల్యే గైక్వాడ్, ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్‌కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. నిర్వాహకుడు అక్కడికి రాగానే ముఖంపై చెంపదెబ్బ కొట్టి, బలంగా గుద్దడంతో అతడు కిందపడిపోయాడు. ఇదంతా అక్కడున్న వారు తమ ఫోన్లలో రికార్డు చేశారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్యే గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. ఇదే శివసేన స్టైల్ అంటూ సమర్థించుకోవడం గమనార్హం.
తనకు పాడైపోయిన పప్పు వడ్డించారని, అది తిన్న తర్వాత తనకు కడుపునొప్పి వచ్చిందని ఎమ్మెల్యే గైక్వాడ్ ఆరోపించారు. "ఆహార నాణ్యతపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఎవరైనా మాటలతో విననప్పుడు బాలాసాహెబ్ థాకరే మాకు నేర్పిన భాషలోనే సమాధానం చెప్పాను. నేను చేసింది సరైనదే. ఇదే మా శివసేన స్టైల్" అని ఆయన తన చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే గైక్వాడ్ స్పష్టం చేశారు.
అయితే, క్యాంటీన్‌లోని ఇతర వినియోగదారులు, సిబ్బంది మాత్రం ఎమ్మెల్యే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఆహార నాణ్యత కచ్చితంగా మెరుగుపడాల్సిందే అయినా, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
Social Plugin