ANDHRAPRADESH:శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ సందడి మొదలైంది. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ రోజు (శుక్రవారం) నుంచి ఈ ఉత్సవాలు ఆగస్టు 23 వరకు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు తరలిరాను న్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 రోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
శ్రీశైలం ఆలయానికి శ్రావణ మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శని, ఆది, సోమవారా లతో పాటు ప్రభుత్వ సెలవుదినాలు, ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. మొత్తం 16 రోజుల పాటు భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తూ ఈ మేరకు ఆయా రోజుల్లో గర్బాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆగస్టు మాసంలో నాలుగు రోజుల పాటు స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు, అన్నదాన విభాగంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆలయ దర్శనాల్లోనూ మార్పులు చేశారు.
అందులో భాగంగా తెల్లవారు జామున మార్పులు 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఉభయ దేవాలయాల్లో మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించి.. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ వత్రాలు చేసుకునేవారికి స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. రెండవ, నాల్గో శుక్రవారాల్లో ఉచితంగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ సిబ్బందితో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Social Plugin