Ticker

6/recent/ticker-posts

తిరుపతి-షిర్డీ ప్రయాణికులకు 20 ప్రత్యేక రైళ్లు..! పూర్తి వివరాలివే..!


ANDHRAPRADESH:ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ బంపర్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఈ సీజన్ లో తిరుపతి, షిర్డీతో పాటు ఈ రెండు నగరాలకు మధ్య ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారి కోసం ఏకంగా 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతి-షిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లను, అలాగే ధర్మవరం-సోలాపూర్ మధ్యన మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. తిరుపతి-సాయినగర్ షిర్డీ ప్రత్యేక రైలు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకూ ప్రతీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 10.45కు గమ్యానికి చేరుకుంటుంది. అలాగే సాయినగర్ షిర్డీ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక సర్వీసు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకూ ప్రతీ సోమవారం రాత్రి 7.35కు బయలుదేరి బుధవారం అర్ధరాత్రి 1.30కు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కీ, ఉద్గీర్‌, పర్ని రంగం, లాతూర్‌ జల్నా, ఔరంగాబాద్, నాగర్‌సోల్, మన్మాడ్, కోపర్‌గావ్ స్టేషన్‌లలో ఇరువైపులా ఆగుతాయి.

అలాగే సోలాపూర్-ధర్మవరం ప్రత్యేక రైలు ఇవాళ రాత్రి 11.20కి బయలుదేరి శనివారం తెల్లవారు జామున 3.30కి గమ్యానికి చేరుకుంటుంది. ధర్మవరం-సోలాపూర్ ప్రత్యేక రైలు ఎల్లుండి (శనివారం) ఉదయం 6.30కి బయలుదేరి తిరిగి ఆదివారం ఉదయం 10.45కి గమ్యానికి చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కుర్దువాడి, బర్షి టౌన్, ధారశివ్ లాతూర్, లాతూర్ రోడ్, ఉద్గిరి, భాల్కి, బీదర్, హోమ్నాబాద్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్ మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, తిరుపతి, కడపలో ఆగుతాయి. మదనపల్లె రోడ్డు, ముల్కలచెరువు, కదిరి స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.