ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేబినెట్లోనే నిర్ణయించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై నెగెటివ్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ఎల్లుండి ప్రారంభించబోతున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం షెడ్యూల్, టైమ్ కూడా ఖరారైంది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు.. ఎల్లుండి ఉదయం ఇంటింటి ప్రచారం కార్యక్రమం ప్రారంభిస్తారు.
జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారు. కుప్పంలోని శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో బుధవారం ఉదయం 8:00 గంటల నుండి డోర్ టూ డోర్ క్యాంపెయిన్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్యయంగా ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు కుప్పంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన కార్యక్రమాల్ని సైతం ప్రజలకు వివరిస్తారు.
అనంతరం 10:55 గంటలకు తుమిసి వద్దనున్న ఏపీ మోడల్ స్కూల్ వద్ద పబ్లిక్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 3:00 గం.కు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సి సెంటర్ ను సీఎం ప్రారంభిస్తారు. సాయంత్రం 4:20 గం.కు శాంతిపురం మండలంలోని తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకొని అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Social Plugin