Ticker

6/recent/ticker-posts

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్


ఏలూరు, జూన్ 13: ఏలూరు జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల (ఆప్కోస్) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యాల (డీఏ)ను విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన మూడు సరెండర్ లీవ్‌ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న ఈ సందర్భంలో ఉద్యోగుల అభివృద్ధి కోసం కార్యాచరణ చేపట్టి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ తీసుకునే నిర్ణయాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని చోడగిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.