Ticker

6/recent/ticker-posts

ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంపై పవన్ కల్యాణ్ సీరియస్


ANDRAPRADESH, NTR, JUN 06: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా. NTTPS) నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ (బూడిద) కాలుష్య సమస్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దృష్టికి చేరింది. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జనసేన నాయకుడు అక్కల గాంధీ ఈ సమస్యను పవన్ కల్యాణ్‌కు వివరించారు.


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిన్న (శుక్రవారం) మూలపాడు గ్రామానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ను స్థానిక నాయకులు కలిసి ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ కారణంగా పరిసర గ్రామాల్లో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ సుమారు అరగంట పాటు స్థానిక నాయకులు, సంబంధిత వర్గాలతో చర్చించారు. బూడిద కాలుష్యం వల్ల రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే ఫ్లై యాష్ కారణంగా చెట్లు, పంటలు, పశువులు ప్రభావితమవుతున్నాయని, గ్రామాల్లో గాలి కాలుష్యం పెరుగుతోందని స్థానికులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ జెన్కో అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచిస్తామని తెలిపారు.