Ticker

6/recent/ticker-posts

గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం


ఏలూరు, మే 9: ఆనం రామనారాయణరెడ్డి గోదావరి పుష్కరాలను మరింత ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం లో రూ.29 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆకాశరాజు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.


మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్నాన ఘట్టాలు, పిండప్రదాన ఘాట్లు, రహదారులు, త్రాగునీటి సదుపాయాలు, దేవాలయాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 43 ఆలయాల అభివృద్ధికి రూ.54.71 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని జీర్ణోద్ధరణ దశలో ఉన్న 6200 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల నిర్వహణ కోసం అర్చకులకు ఏటా రూ.74.74 కోట్ల నిధులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే 691 ఆలయాల అభివృద్ధికి రూ.812.67 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. దేవాలయాల్లో భక్తుల సంఖ్య 35 శాతం పెరగడం సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితమని పేర్కొన్నారు.

సనాతన ధర్మ ప్రచారం కోసం ఆలయాలు లేని గ్రామాలు, కాలనీల్లో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 వరకు భజన మందిరాలు నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపించాలని కోరారు. స్థల విస్తీర్ణాన్ని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 1059 భజన మందిరాలకు ప్రతిపాదనలు అందగా, రూ.181.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

వేద సంస్కృతి పరిరక్షణపై కూడా మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. నేటి యువత వేదాధ్యయనం వైపు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. వేద విద్యార్థులకు ఉద్యోగం వచ్చే వరకు మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.3 వేల భృతి అందిస్తున్నామని తెలిపారు. దేవాదాయ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తూ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ద్వారకాతిరుమల, ఐ.ఎస్. జగన్నాథపురం నుంచి పోలవరం వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3.75 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో గిరి ప్రదక్షిణ మార్గాల అభివృద్ధికి రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, వంశపారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృతిరావు తదితరులు పాల్గొన్నారు.