Ticker

6/recent/ticker-posts

ఏపీకి వచ్చే ప్రతి పరిశ్రమకూ అండగా ఉంటాం: మంత్రి లోకేశ్..


విశాఖ, ఏప్రిల్ 28: ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. పదేళ్లలో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో పూర్తి ఎకో సిస్టమ్ తయారు చేస్తున్నామని తెలిపారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన 'భారత్ ఏఐ శక్తి కాన్‌క్లేవ్'లో మంత్రి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. డేటా సెంటర్లు తేవడమే కాదు.. వాటి నిర్వహణ కూడా కీలకమని అన్నారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏపీకి వచ్చిన ప్రతి పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌‌కు భూమిపూజ జరిగింది.

సీఎం చంద్రబాబు నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.. ఏపీలో ఏర్పాటు కావడంపై కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సెప్టెంబర్‌ 2028 నాటికి గూగుల్‌ డేటా సెంటర్‌ పూర్తి కానుంది. మరోవైపు అతి త్వరలో అన్ని రంగాల్లో ఏఐ సేవలు విస్తరించనున్నాయి. డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం భారత్ ఏఐ శక్తి కాన్‌క్లేవ్‌లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.